శ్రీశైలం నీటిమునక నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి: లబ్బి వెంకటస్వామి డిమాండ్

శ్రీశైలం నీటిమునక ప్రాంత నిరుద్యోగులకు జీవో నెం. 98 ప్రకారం ఇంటికొక ఉద్యోగం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ సమస్యను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన కోరారు.

నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఎన్నికైన తర్వాత పార్లమెంటులో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న తీరు అభినందనీయమని లబ్బి వెంకటస్వామి కొనియాడారు. గతంలో పెండేకంటి వెంకటసుబ్బయ్య తర్వాత నంద్యాల గడ్డ నుంచి ప్రజా సమస్యలపై ఇంత చురుకుగా స్పందించే ఎంపీ లేరని, ఇప్పుడు శబరి రూపంలో ఆ లోటు తీరిందని ఆయన అభిప్రాయపడ్డారు.

బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా, ప్రజా సేవలో గొప్ప చరిత్ర ఉందని, బైరెడ్డి శేషశయనరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని బైరెడ్డి శబరి కొనసాగిస్తున్నారని లబ్బి వెంకటస్వామి ప్రశంసించారు. జీవో నెం. 98 సమస్యను పార్లమెంటులో ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయగల సమర్థురాలు శబరి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం నందికొట్కూరులో 158 రోజులుగా కొనసాగుతున్న శ్రీశైలం నీటిమునక నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని లబ్బి వెంకటస్వామి సందర్శించారు. అనంతరం నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా బయలుదేరి, జై కిసాన్ పార్క్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986లో ఎన్టీఆర్ ఇచ్చిన జీవో నెం. 98 ప్రకారం ఇంకా 674 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉందని, దాదాపు 40 ఏళ్లు గడిచినా వరుస ప్రభుత్వాలు ఆ జీవోను పూర్తిగా అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. నీటిమునక నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తే వలసలు తగ్గి, ఆ కుటుంబాలు స్థిరమైన జీవనాన్ని కొనసాగించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ సమయంలో ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు బైరెడ్డి శేషశయనరెడ్డి, తానే మాత్రమే కృషి చేశామని లబ్బి వెంకటస్వామి గుర్తుచేశారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించకపోతే కోర్టును ఆశ్రయించే పరిస్థితి వస్తుందని, అప్పుడు తలెత్తే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

జీవో నెం. 98 అమలయ్యేంత వరకు జరిగే ప్రతి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని లబ్బి వెంకటస్వామి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, నిరుద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.