రాయలసీమ న్యూస్, నంద్యాల:
శ్రీశైలంలో శ్రావణ సోమవారం సందడి
శ్రీశైలం: శ్రావణమాసం, అదీ సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజామున నుంచే దేశం నలుమూలల నుంచి భక్తులు మహాక్షేత్రానికి తరలివచ్చి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు.
భక్తుల పెరిగిన రద్దీ దృష్ట్యా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మూడు రోజులపాటు సాధారణంగా ఆర్జిత సేవల ద్వారా జరిగే దర్శనాల స్థానంలో భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే ప్రోటోకాల్ సిఫార్సుతో వచ్చే భక్తులకు మాత్రం రాత్రి 8.30 గంటల తర్వాత స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రముఖుల సిఫార్సుపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనాలు కొనసాగుతుండగా, ఉదయం వేళల్లో మాత్రం ప్రముఖులు స్వయంగా క్షేత్రానికి వచ్చినప్పుడే స్పర్శ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు.
భక్తుల రద్దీ కారణంగా ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల దర్శనానికి సగటున మూడు గంటల సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సూచించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.
భక్తుల రద్దీ పెరిగినా, ఆర్జిత సేవలను నిలిపివేయడంతో సాధారణ భక్తుల దర్శనాలు త్వరితగతిన సాగుతున్నాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా వేలాదిమంది భక్తులతో శ్రీశైలం మహాక్షేత్రం సందడిగా మారింది.













