రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్:
మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు: కిడ్నీ క్యాన్సర్‌కు తొలి సంకేతం కావొచ్చని నిపుణుల హెచ్చరిక
మూత్రంలో రక్తం కనిపించడం చాలామంది పెద్దగా పట్టించుకోని సమస్యగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా నొప్పి లేకుండా ఒకోసారి మాత్రమే రక్తం కనిపిస్తే, డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్లు ఉండి ఉంటాయని భావించి నిర్లక్ష్యం చేసే వారు ఎక్కువ. అయితే నొప్పి లేకుండా మూత్రంలో రక్తం కనిపించడం, కిడ్నీ క్యాన్సర్‌కు తొలి హెచ్చరిక సంకేతం కావొచ్చని చెన్నైలోని ఆసియన్ Institute అఫ్ నెఫ్రోలోజి అండ్ యూరాలజీ కి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం, కిడ్నీ క్యాన్సర్ మొదటి దశల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే నిశ్శబ్దంగా పెరుగుతుంది. అందుకే మూత్రంలో రక్తం కనిపించే సమస్యను అస్సలు లైట్‌గా తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు. రోగాన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా, ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
వైద్య భాషలో మూత్రంలో రక్తం కనిపించడాన్ని ‘హెమటూరియా’ అంటారు. ఈ పరిస్థితిలో మూత్రం గులాబీ, ఎరుపు లేదా కోకాకోలా రంగులో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో కంటికి కనిపించకపోయినా, యూరిన్ పరీక్షల్లో రక్తం ఉన్నట్లు బయటపడుతుంది. నొప్పి ఉన్నా లేకపోయినా, ఒక్కసారి అయినా మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీ క్యాన్సర్ ముదిరిన తర్వాతే సాధారణంగా నడుము నొప్పి, పొత్తికడుపులో గడ్డ, బరువు తగ్గిపోవడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు బయటపడతాయి. ఆ దశకు చేరేసరికి వ్యాధి నియంత్రణ కష్టతరమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే మూత్రంలో రక్తం కనిపించిన ప్రతిసారీ అది కిడ్నీ క్యాన్సర్‌నే సూచిస్తుందని కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి వాపు, ఇతర కిడ్నీ వ్యాధులు వంటి కారణాల వల్ల కూడా రక్తం రావచ్చు. అందుకే భయపడకుండా, కానీ నిర్లక్ష్యం చేయకుండా, యూరాలజిస్ట్‌ను సంప్రదించి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్, CT స్కాన్ లేదా MRI వంటి పరీక్షల ద్వారా అసలు కారణాన్ని నిర్ధారించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కిడ్నీ క్యాన్సర్ ప్రమాదం 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుందని, అయితే యువకుల్లో కూడా పూర్తిగా మినహాయింపు లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొగతాగే అలవాటు ఉన్నవారికి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, ఇప్పటికే కిడ్నీ జబ్బులు ఉండటం, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ చరిత్ర ఉండటం వంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గించుకోవడం, పొగాకు పదార్థాలకు దూరంగా ఉండడం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా తక్కువ కోతతో, తక్కువ నొప్పితో, త్వరగా కోలుకునేలా చికిత్స చేయడం సాధ్యమవుతోంది. ఈ విధానాల ద్వారా కిడ్నీ పనితీరును కూడా ఎక్కువగా కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మన శరీరం పెద్ద సమస్య రాకముందే చిన్న చిన్న సంకేతాల ద్వారా హెచ్చరిస్తుందని వైద్యులు గుర్తుచేస్తున్నారు. మూత్రంలో రక్తం కనిపించడం కూడా అలాంటి హెచ్చరికలలో ఒకటి కావొచ్చని, నొప్పి లేదని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకునే అవకాశం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.







