రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ముందుకు రాని అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీపై అంతర్జాతీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.
తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షంగా పాల్గొంటారా? ఇప్పటివరకు రహస్య ప్రాంతం నుంచి దేశాన్ని నడిపిస్తున్న ఆయన ఈ సందర్భంగా బహిరంగంగా కనిపిస్తారా? అనే ప్రశ్నలు ఇరాన్ రాజకీయ వర్గాల్లో, అంతర్జాతీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన దాడుల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు సమాచారం. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు ముఖమంతా కాలిపోయినట్టు ఆ దేశ మీడియా గతంలో వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీ జీవించి ఉన్నారని, రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలకు ఆయన ఉనికి, స్థానం తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా మొజ్తాబాను ప్రత్యక్షంగా కలవడం లేదని వార్తలు వెలువడ్డాయి. అయితే పాలనా వ్యవహారాల్లో మొజ్తాబా ఖమేనీ పేరు నిరంతరం వినిపిస్తోంది. ఆయన పేరిటే ప్రభుత్వ ప్రకటనలు విడుదలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య స్థితిగతులపై, నిజంగా ఎంతవరకు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమానాలకు చెక్ పెట్టేలా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షమవుతారా? అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాల నడుమ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని జులై 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నాయి. జులై 9న ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఆయనను ఖననం చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సద్దుమణిగినా, ఈ వాతావరణంలో అలీ ఖమేనీ అంత్యక్రియలను యథావిధిగా నిర్వహిస్తారా, లేక వాయిదా వేస్తారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.







