రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
భారత్‌లో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్ తయారీ
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు
మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఊతమిచ్చే దిశగా ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌లో భాగమైన ఇంటర్‌సెప్టర్ మిసైల్స్ తయారీని భారత్‌లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ దిశగా భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఇంటర్‌సెప్టర్ మిసైల్స్ తయారీ ఇజ్రాయెల్‌లో జరుగుతోంది. అంతేకాకుండా, కొంతకాలం క్రితమే అమెరికాలో కూడా ఈ మిసైల్స్ ఉత్పత్తి ప్రారంభమైంది. అమెరికా రక్షణ రంగ సంస్థ రేథియాన్ భాగస్వామ్యంతో రాఫెల్ ఈ ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇక భారత్‌లో ప్రొడక్షన్ లైన్ ఏర్పాటైతే మిసైల్ తయారీ ఖర్చు మరింత తగ్గే అవకాశం ఉంది. ఐరన్ డోమ్‌కు సంబంధించిన సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య గొప్ప సహకారం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాలు బరాక్-8 దీర్ఘ శ్రేణి మిసైల్‌ను కలిసి అభివృద్ధి చేశాయి. గగనతల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని భారత త్రివిధ దళాలు వినియోగిస్తున్నాయి. ఇక పశ్చిమాసియాలో ఘర్షణలతో గగనతల రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఐరన్ డోమ్ ప్రొడక్షన్ లైన్ ఏర్పాటుతో రాఫెల్ సంస్థకు వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.







