రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం
పశ్చిమాసియా ప్రాంతం మరోసారి యుద్ధ వాతావరణంతో కుదేలైంది. అమెరికా–ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో అలర్ట్ సైరన్లు మోగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్ కొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకారం, బహ్రెయిన్, కువైట్‌లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టారు. బహ్రెయిన్‌లోని US ఫిఫ్త్ ఫ్లీట్ , కువైట్‌లోని అలీ ఐ సేలం ఎయిర్ బేస్ సహా అగ్రరాజ్యానికి చెందిన కీలక మిలిటరీ స్థావరాలు ఈ దాడుల్లో టార్గెట్ అయ్యాయని ఐఆర్‌జీసీ వెల్లడించింది.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల అనంతరం అమెరికా వైమానిక దాడులు జరపడం కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఐఆర్‌జీసీ ఆరోపించింది. అగ్రరాజ్యం ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దానికి ప్రతీకారంగానే ఈ తాజా ఆపరేషన్ చేపట్టామని టెహ్రాన్ వర్గాలు పేర్కొన్నాయి. బుషెహర్ ప్రాంతంలో అమెరికా అత్యాధునిక MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్‌జీసీ ప్రకటించింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీయి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు చెలరేగడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ చారిత్రక కార్యక్రమాన్ని మరుగున పడేసేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఐఆర్‌జీసీ విమర్శించింది.
తాజా పరిణామాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ సోషల్ మీడియాలో స్పందించారు.
వేధింపులు, బెదిరింపుల శకం ముగిసింది. ఇక మేం తలొగ్గబోం. అమెరికా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఆ దేశం ఎంత ఒత్తిడి చేసినా టెహ్రాన్ లొంగిపోదు.
ఇరాన్‌పై అమెరికా ఈసారి అతిపెద్ద దాడి జరిపినట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దాదాపు 80కి పైగా లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసినట్లు తెలిపింది. టెహ్రాన్ కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, కోస్టల్ రాడార్ సైట్లు, అంటి - షిప్ మిస్సైల్ సామర్థ్యాలు, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది.
ఈ దాడుల్లో IRGCకి చెందిన 60 చిన్న బోట్లు ధ్వంసమైనట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కీయే లో ఉన్నారు. అక్కడి నుంచే ఇరాన్‌పై తాజా దాడులకు ఆయన ఆదేశాలిచ్చినట్లు సమాచారం వెలువడింది.
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం కుదిరినా, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకపోవడం వల్ల గల్ఫ్ ప్రాంత భద్రత, ఇంధన సరఫరాలపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







