‘ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’ పేరుపై అమెరికా యూటర్న్‌

భారత్‌కు షాక్‌ ఇచ్చిన ట్రంప్‌..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు కీలక వ్యూహాత్మక భాగస్వామి అని గతంలో పదేపదే హైలైట్‌ చేసిన అమెరికా.. ఇప్పుడు అదే ప్రాంతానికి సంబంధించిన కీలక సైనిక కమాండ్‌ పేరులో మార్పు చేసి న్యూఢిల్లీకి అనూహ్య షాక్‌ ఇచ్చింది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే అగ్రరాజ్య సైనిక కమాండ్‌ అధికారిక పేరులో నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించింది.

జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమెరికా రక్షణశాఖ ప్రకటన ప్రకారం.. ఇప్పటివరకు ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా పిలుస్తున్న కమాండ్‌ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు.

చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించాం

అని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది.

యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ ఏర్పాటుకు 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌. ట్రుమ్యాన్‌ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా వెస్ట్‌ కోస్ట్‌ నుంచి భారత పశ్చిమ తీర ప్రాంతాల వరకు విస్తరించిన విస్తార సముద్ర ప్రాంతంలో ఈ కమాండ్‌ గత ఏడు దశాబ్దాలకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రాంతీయ స్థిరత్వం నెలకొల్పడంలో, కొరియన్‌, వియత్నాం యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. అనేక మానవతా సహాయ, రక్షణ ఆపరేషన్లను కూడా ఈ దళం చేపట్టింది.

ట్రంప్‌ తొలి దఫా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే 2018లో ఈ కమాండ్‌ పేరును ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించేందుకు, ఆ వాస్తవాన్ని ప్రతిబింబించేందుకు పేరులో ‘ఇండో’ అనే పదాన్ని చేర్చినట్లు అప్పటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ వివరణ ఇచ్చారు.

అయితే ఎనిమిదేళ్ల వ్యవధిలోనే అదే ట్రంప్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ పేరుపై యూటర్న్‌ తీసుకోవడం విశ్లేషకుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. ఇండో-పసిఫిక్‌ వ్యూహాత్మక సమీకరణల్లో భారత్‌ ప్రాధాన్యతను తగ్గించే దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తోందా? రక్షణ, భద్రతా వ్యవహారాల్లో న్యూఢిల్లీని పరోక్షంగా దూరం పెడుతోందా? అన్న ప్రశ్నలు నిపుణుల వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యం, దాని దీర్ఘకాల ప్రభావాలపై స్పష్టత కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఎదురు చూస్తోంది.