రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు
.. ఉద్రిక్తత.. ఒకరు మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
ఇరాన్‌పై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. దాడులు జరిగాయి. దాంతో గురువారం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. కువైట్‌లోని స్థావరాలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది. తమ దేశంవైపు వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నామని కువైట్ వెల్లడించింది.
నౌకలను టార్గెట్ చేస్తే: ట్రంప్ హెచ్చరిక
హర్మూజ్‌లో వెళ్తున్న నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో తాజా ఘర్షణలు మొదలయ్యాయి. జలసంధిలో నౌకలపై దాడులను ఏమాత్రం సహించబోమని తాజాగా ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చేసే ఒక్కో దాడికి 20 రెట్లు తీవ్రమైన దాడి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రి సమయంలో చేసిన దాడులతో ఇరాన్ డీల్ కోసం ప్రాధేయపడుతోందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డీల్ కోసం తహతహలాడుతున్నారు. అందుకు వారు అర్హులా..? వారు డీల్‌ను గౌరవిస్తారా..? అనేదానిపై మాత్రం నాకు పూర్తి స్పష్టత లేదు. అదే అసలు సమస్య’’ అని తుర్కియే నుంచి వస్తూ తన ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అమెరికా బందర్ అబ్బాస్, అణుప్లాంట్ ఉన్న బుషెహర్, సిరిక్, జస్క్, అబూ మూసా ద్వీపంపై దాడులు నిర్వహించింది.







