రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా
భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్ అంచనా
వెనెజువెలా భూకంపాల ధాటికి చిగురుటాకులా వణికింది. ఈ ప్రకృతి విపత్తు తీవ్రతతో దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. కరేబియన్ తీరంలోని మోరోన్ పట్టణానికి పశ్చిమాన 21 కిలోమీటర్ల దూరంలో 7.2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. అదే పట్టణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో క్షణాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని, దాంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘‘ఈ భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు రావొచ్చు. దాంతో ఈ విపత్తు విధ్వంసకరంగా ఉండొచ్చు. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. మృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
ప్రస్తుతానికి వెనెజువెలా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఇళ్ల నుంచి బయటకు వచ్చేయండి..
ఇళ్లను వదిలి బయటకు వచ్చేయాలంటూ భూకంపాల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వెనెజువెలా ప్రభుత్వం సూచించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లకున్న పెట్రోల్ సరఫరాను కట్ చేసినట్లు వెల్లడించింది. కొన్ని భవనాలు కూలిపోయాయని, మరింత నష్టం వాటిల్లకుండా ఈ చర్యలని పేర్కొంది.
జాతీయ సెలవుదినం కావడంతో..
జూన్ 24.. వెనెజువెలాలో నేషనల్ హాలిడే. దాంతో మిగతా రోజులతో పోలిస్తే.. ఎక్కువమంది ఇళ్లలోనే ఉన్నారు. నిన్నసాయంత్రం ఆరుగంటల సమయంలో తొలి భూకంపం వచ్చింది. దాంతో భూమి కంపించినప్పుడు భారీగా ప్రజలు బయటకు పరిగెత్తిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణనష్ట తీవ్రత పెరగడానికి ఈ హాలిడే కూడా ఒక బలమైన కారణం కావొచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ విపత్తులో భారీగా మరణాల సంఖ్య ఉండొచ్చని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కూడా తన సందేశంలో పేర్కొన్నారు.
20 ప్రకంపనలు.. దేశంలో ఎమర్జెన్సీ
రెండు భారీ భూకంపాల తర్వాత 20 వరకు ప్రకంపనలు వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెనెజువెలాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం ధాటికి మెక్వెషియా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో దానిని మూసివేశారు. పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. రాజధానితో పాటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు.







