రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
కర్ణాటక కాంగ్రెస్లో ముసలం
శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్కు కొత్త తలనొప్పిగా మారింది. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నేత, మంత్రి రామలింగ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితమే ఆయన కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఇరిగేషన్ శాఖ కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
బుధవారం రామలింగ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. సిద్దరామయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగ రెడ్డి , ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డి కె శివకుమార్ నేతృత్వంలోని కేబినెట్లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు దక్కుతుందని ఆశించారు. కానీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించడంతో అసంతృప్తి చెలరేగింది.
గతంలో డి కె శివకుమార్ తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని రామలింగ రెడ్డి ఆరోపించారు. వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను పదే పదే అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రామలింగ రెడ్డి లాంటి సీనియర్ నేత అసంతృప్తి పార్టీకి భారీ నష్టం కలిగించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు వంటి కీలక ప్రాంతంలో బలమైన పట్టు ఉన్న నేతగా ఆయనను పార్టీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా ప్రభుత్వ స్థిరత్వంపై కూడా ప్రభావం చూపవచ్చన్న చర్చ నడుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో చీఫ్ మినిస్టర్ డి కె శివకుమార్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో అత్యవసరంగా భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై సిద్దరామయ్య సలహాలు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు హోమ్ శాఖ కోసం ప్రియాంక ఖర్గే వంటి నేతలు కూడా పట్టుబడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి నెలకొనడంతో, కేబినెట్ విస్తరణ, శాఖల పంచాయితీపై హైకమాండ్ కూడా కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. రామలింగ రెడ్డి రాజీనామా స్వీకరణ, తదుపరి చర్చల దిశలో పార్టీ ఎలా ముందుకు సాగుతుందన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మారింది.







