రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్:
ప్రధాని మోడీని కోరిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
కావేరి నదిపై ప్రతిపాదిత మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు కేంద్ర స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
బెంగళూరు తాగునీటి అవసరాల తీర్చడం, విద్యుత్ ఉత్పత్తి కోసం మేకెదాటు ప్రాజెక్ట్ కీలకమని కర్ణాటక వాదిస్తోంది. రామనగర జిల్లాలో (దక్షిణ బెంగళూరు) ప్రతిపాదించిన ఈ జలాశయం ద్వారా బెంగళూరుకు తాగునీటిని అందించడంతో పాటు సుమారు 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తమిళనాడుకు కావేరి నీటిలో కేటాయించిన వాటాకు ఎలాంటి ఆటంకం కలగదని కర్ణాటక హామీ ఇస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకెదాటు ప్రాజెక్ట్ అమలు అయితే తమకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. కావేరి జల వివాద ట్రైబ్యునల్ తుది తీర్పుకు ఈ ప్రాజెక్ట్ విరుద్ధమని తమిళనాడు ఆరోపిస్తోంది. దీనివల్ల కావేరి డెల్టా ప్రాంతంలోని రైతులు నష్టపోతారని, కర్ణాటక ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్రం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధానిని కలిసిన డీకే శివకుమార్, ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతున్న మేకెదాటు ప్రాజెక్ట్‌కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని మోదీని అభ్యర్థించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టులో తమిళనాడు దాఖలు చేసిన రివ్యూ, ఇతర అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే తగిన క్లియరెన్స్ ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది.
మేకెదాటు ప్రాజెక్ట్ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA), కేంద్ర జల సంఘం (CWC)లకే ఉందని డీకే శివకుమార్ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సవరించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సమర్పించేందుకు కర్ణాటక సిద్ధమవుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం అవసరమని కూడా డీకే శివకుమార్ కోరారు. మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమ అభ్యంతరాలను గత నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం కర్ణాటక ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడాన్ని తమిళనాడు ప్రశ్నిస్తోంది.







