రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు : పేదలకు సొంతింటి కల సాకారం దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో పీఎంఏవై-పట్టణం 2.0 పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాకు గృహాల మంజూరు జరిగింది.
అధికారిక వివరాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొత్తం 1,543 ఇళ్లను కేటాయించారు. ఇందులో కర్నూలు జిల్లాకు 808 ఇళ్లు, నంద్యాల జిల్లాకు 735 ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలు కలిగిన పేద కుటుంబాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు.
ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఈ నిధులను దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
పీఎంఏవై-పట్టణం 2.0 పథకం కింద పట్టణ పేదలకు మౌలిక వసతులతో కూడిన గృహాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, భూముల గుర్తింపు, సాంకేతిక అనుమతుల ప్రక్రియను స్థానిక సంస్థల ద్వారా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పథకం ద్వారా గృహరహిత పట్టణ పేదలకు సొంత ఇల్లు లభించడం తో పాటు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేటాయించిన ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా జిల్లా స్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.













