రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు : కర్నూలు జిల్లా ఓటరు జాబితా సవరణకు గడువులను పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి Dr. సిరి ప్రకటించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR–2026లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లాలో ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలకు సంబంధించిన అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువులో చాలామంది ఓటర్లు తమ వివరాలు సరిచేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో, ప్రజల సౌకర్యార్థం ఈ పొడిగింపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణకు వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన ప్రక్రియను అక్టోబర్ 5 వరకు కొనసాగించనున్నట్లు Dr. సిరి వివరించారు. సంబంధిత తహసీల్దార్లు, రేవెన్యూ అధికారులు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో ఈ పరిశీలనను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఆమె సూచించారు.
సవరణ ప్రక్రియ పూర్తయ్యిన అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్ 9న ప్రచురించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు అన్ని దశల్లోనూ చట్టబద్ధమైన విధానాలను అనుసరించి, ఎలాంటి లోపాలు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి అర్హుడైన ఓటరు పేరు తప్పనిసరిగా జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని Dr. సిరి సూచించారు. గ్రామ, వార్డు స్థాయిలో పనిచేస్తున్న Booth Level Officers ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కొత్తగా 18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువతీ యువకులు, చిరునామా మార్పు చేసుకున్న వారు, మరణించిన వారి వివరాల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు.
ఓటరు జాబితా సవరణ గడువు పొడిగింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని జిల్లా ఎన్నికల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో నమోదు కావడం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.













