రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఉగ్ర అనుమానాలతో కలకలం రేగింది. సికింద్రాబాద్‌కు చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అనుమానిత ఉగ్రవాదిగా గుర్తించిన ఐబీ బృందం కర్నూలు శివారులో ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అరెస్ట్ అనంతరం నూర్ మహమ్మద్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ అతడిని సంబంధిత అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. అతడి గత చరిత్ర, ఇటీవల కాలంలో అతడు చేసిన ప్రయాణాలు, పరిచయాలపై విచారణ సాగుతున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్‌కు చెందిన నూర్ మహమ్మద్ కొంతకాలంగా కర్నూలు నగర శివారులోని గొందిపర్ల గ్రామంలో ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులు కొంతకాలంగా నిఘా పెట్టినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నిఘా అనంతరమే ఐబీ అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నూర్ మహమ్మద్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే అంశంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అతడి ఫోన్ కాల్ రికార్డులు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. అతడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా, ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు శివారులోని గొందిపర్ల ప్రాంతంలో పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తిని ఐబీ అధికారులు అరెస్ట్ చేయడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణ కార్మికుడిగా కనిపించిన వ్యక్తి ఉగ్ర అనుమానాల నేపథ్యంలో అరెస్ట్ కావడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
నూర్ మహమ్మద్ అరెస్ట్‌పై అధికార వర్గాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది. విచారణ పూర్తయ్యాకే అతడి పాత్ర, సంబంధాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.













