రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభంపై వివాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిన్న డోన్‌లో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ZP Chairman ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై ఎంపీడీవో అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అధికారికంగా తెలియజేయకుండా కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. ఎంపీడీవో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ZP చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు మరో 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను నిందితులుగా పోలీసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిపై Cr. No.121/2026గా కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో BNS సెక్షన్లు 189(2), 329(4), 331(1), 324(3), 61(2) r/w 190తో పాటు PDPP Act సెక్షన్ 3 కింద నేరాలు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం, ప్రభుత్వ కార్యాలయ నిర్వహణ, ఆస్తి పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఘటనపై డోన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీడీవో ఫిర్యాదు, కార్యాలయం ప్రారంభించిన విధానం, కార్యక్రమంలో పాల్గొన్న వారి పాత్రలపై వివరాలు సేకరిస్తున్నారు. సంబంధిత సాక్ష్యాలు, వీడియో దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
డోన్ పట్టణంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం చుట్టూ నెలకొన్న ఈ వివాదం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.













