తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల పాలనలో బందీగా ఉన్న బెంగాల్‌ ఇప్పుడు సంకెళ్ల నుంచి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బెంగాల్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో రక్తపాతం, ప్రాణనష్టం జరిగినప్పటికీ బెంగాల్‌ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని ప్రధాని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో బెంగాల్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించినందుకు ప్రజలు కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పారని మోదీ అభిప్రాయపడ్డారు.

ఒకే ఒక్క ఎన్నికల తీర్పు తెచ్చిన మార్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని, అభివృద్ధి ఫలితాలు నేలమట్టం వరకు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత్–బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రత అంశంపై కూడా ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటుకు అవసరమైన భూమిని టీఎంసీ ప్రభుత్వం కేటాయించలేదని ఆయన దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్రంలోకి మమత బెనర్జీ అనుమతించారని ఆరోపించారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు అవసరమైన భూమిని భాజపా ప్రభుత్వం కేటాయించిందని మోదీ తెలిపారు. సరిహద్దు భద్రత బలోపేతం కావడంతో పాటు అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ వంటి కార్యకలాపాలపై నియంత్రణ సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

బెంగాల్‌ భవిష్యత్తు, భద్రత, అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు అనుగుణంగా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.