తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ‘ అమ్రిత్ భారత్ స్టేషన్ స్కీం ’ కింద పునరాభివృద్ధి చేసిన 75 హైటెక్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17న ఒకేసారి వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఆధునిక హంగులు, సౌకర్యాలతో ముస్తాబైన ఈ స్టేషన్లు అధికారికంగా ప్రయాణీకుల వినియోగానికి అందుబాటులోకి రానున్నాయి.

విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక సదుపాయాలతో రీ-డెవలప్ చేసిన ఈ స్టేషన్లలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక కేంద్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ‘Hi-Tech City’ రైల్వే స్టేషన్, అమరావతి సింహద్వారంగా భావించే మంగళగిరి రైల్వే స్టేషన్, విజయవాడ శివారులోని రాయనపాడు స్టేషన్‌లను సహా అనేక స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

తెలంగాణ ఐటీ హబ్‌కు కీలకంగా ఉన్న హైదరాబాద్ ‘ Hi- టెక్ సిటీ ’ రైల్వే స్టేషన్‌ను సుమారు రూ.26 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునికంగా పునరాభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ హైటెక్‌సిటీతో పాటు గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో రోజూ వేలాదిమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం 62 MMTS, సబర్బన్ రైళ్లు నడిచే ఈ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను గణనీయంగా పెంచారు.

స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న రెండు లిఫ్టులకు అదనంగా మరో రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రవేశద్వారాన్ని విస్తరించి అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఓవర్ బ్రిడ్జి , విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, సరికొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు. జంట నగరాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రధాన స్టేషన్లలో కూడా ప్రస్తుతం ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సింహద్వారంగా భావించే మంగళగిరి నియోజకవర్గంలో మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. దాదాపు రూ.12.56 కోట్ల బడ్జెట్‌తో అత్యాధునిక హంగులతో పునర్నిర్మించిన మంగళగిరి రైల్వే స్టేషన్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి రూపు, అనుభూతి కలిగించేలా రీ-డెవలప్‌మెంట్ పనులను రైల్వే శాఖ చేపట్టింది.

ఈ ఆధునీకరణలో భాగంగా స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక బుకింగ్ కౌంటర్లు , కొత్త ప్లాటుఫార్మ్స్ , ఎస్కేలాటోర్స్ , లిఫ్ట్ సదుపాయాలు, డిజిటల్ డిస్ప్లే Boards‌ ను ఏర్పాటు చేశారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో పచ్చదనంతో కూడిన సుందరీకరణ పనులు చేపట్టారు.

మంగళగిరితో పాటు విజయవాడ శివారులోని రాయనపడు రైల్వే స్టేషన్‌ను కూడా ఇదే తరహాలో ఆధునీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ పునరాభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా ‘ అమ్రిత్ భారత్ ’ పథకం కింద చేపట్టిన స్టేషన్ ఆధునీకరణకు భాగస్వామ్యంగా నిలుస్తున్నాయి. ఈ నెల 17న జరిగే వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఈ స్టేషన్లన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.