రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు..
రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డాబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ముంబై రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబై, థానే, రాయగడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు, గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విరార్-వసాయి ప్రాంతంలో డబ్బావాలాల ఇళ్లు నీట మునిగాయి. అలాగే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, ముంబై మాంఖుర్డ్ ప్రాంతంలో ఇళ్లు కూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఐఎండీ హెచ్చరికల ప్రకారం రానున్న గంటల్లో కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సుమారు 15 వేల మంది సిబ్బంది సహాయక చర్యల కోసం సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ప్రభుత్వం హెచ్చరించింది.







