రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!:
మనం కలిసే ఉన్నామా?..
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు షిండే శిబిరంలో చేరిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే..‘మనం నిజంగానే కలిసి ఉన్నామా?’ అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరడం ఉద్ధవ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమైన ఉద్ధవ్.. కేవలం పార్టీ అంతర్గత పరిస్థితులపైనే కాకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి ఉన్న ఎంవీఏ కూటమి ఐక్యతపైనా సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎంపీల ఫిరాయింపుతో పెరిగిన ఒత్తిడి
2022లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో పార్టీ చీలిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే భారీ రాజకీయ నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడటంతో ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరం బలపడుతుందని భావించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉద్ధవ్‌కు ఇబ్బందికరంగా మారింది.
ఎంవీఏలో సమన్వయం లోపిస్తోందా?
ఉద్ధవ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం కేవలం ఎంపీల ఫిరాయింపులే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంవీఏ భాగస్వాముల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదనే భావన శివసేన (యూబీటీ)లో పెరుగుతోందని చెబుతున్నారు. అందుకే మనం నిజంగానే కలిసి ఉన్నామా? అనే ప్రశ్న ద్వారా ఉద్ధవ్ తన మిత్రపక్షాలకు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం దీనిని ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తోంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా బయటకు వస్తుండటం ఉద్ధవ్‌పై విశ్వాసం తగ్గిపోవడానికే నిదర్శనమని ఆ వర్గం వాదిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే-బీజేపీ కూటమి మరింత బలపడుతుండగా, ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతోందని పేర్కొంటోంది.







