భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి ఘనమైన బాటలు పడుతున్న వేళ ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయోగంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ ప్రయోగం అనంతరం స్కైరూట్‌ వ్యవస్థాపకులు పవన్‌కుమార్‌ చందన, నాగ్‌ భరత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ప్రయోగ విజయంపై మోదీ వారిని అభినందించారు. లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి ముందుగానే సాధించారని, ఈ ప్రయోగాన్ని తాను ప్రత్యక్షంగా వీక్షించానని తెలిపారు. ఈ మిషన్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

“అనుకున్న సమయానికంటే ముందుగానే మీ లక్ష్యాలను సాధించారు. ఈ ప్రయోగాన్ని నేను వీక్షించాను. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ మిషన్‌ మొదటి అడుగుమాత్రమే. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి”

అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించగల సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రపంచానికి చూపించారని మోదీ స్కైరూట్‌ బృందాన్ని ప్రశంసించారు. ఈ దేశ ఆకాంక్షలను మోసుకెళ్లడమే కాకుండా యువత కలలకు కొత్త ఆశలు తొడిగారని ఆయన అభినందించారు. అలాగే స్కైరూట్‌ బృందాన్ని తనను కలిసేందుకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్‌కుమార్‌ చందన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. విక్రమ్‌-1 రాకెట్‌ను పూర్తిగా దేశీయంగా డిజైన్‌ చేశామని వివరించారు. తమ బృందంలో ఎక్కువమంది యువతే ఉన్నారని, వారి సగటు వయసు 28 ఏళ్లని తెలియజేశారు.

ఈ లాంచ్‌లో భాగంగా ప్రధాని మోదీ స్వహస్తాలతో “వందేమాతరం” అని రాసిన పోస్ట్‌కార్డును అంతరిక్షంలోకి పంపించారు. ఆ కార్డు ప్రయాణం గురించి పవన్‌కుమార్‌ చందన మోదీకి వివరించారు.

“మీ కార్డు కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. వందేమాతరం కక్ష్యలోకి వెళ్లింది”

ఆ కార్డుపై “వందేమాతరం” రాయడానికి గల కారణాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశభక్తిని రగిలించిన ఈ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్నదని ఆయన గుర్తుచేశారు. కార్డుపై ఆ గేయం పేరు రాయడానికి ఇది ఒక ముఖ్య కారణమని పేర్కొన్నారు.

“అది ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఆ స్ఫూర్తితోనే ముందుకుసాగుతున్నారు. ఇలాగే ఉన్నత శిఖరాలు అందుకునేలా ముందుకు ప్రయాణించండి. నేను మీతో ఉంటాను”

విక్రమ్‌-1 విజయ ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం పాత్ర మరింత బలపడనుందని, స్వదేశీ సాంకేతికత ఆధారంగా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.