రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చిస్తున్నారు.
సమావేశం కొనసాగుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వెన్నునొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులకు తెలియజేసిన పవన్ కల్యాణ్ అనంతరం మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
కేబినెట్ సమావేశంలో అమరావతి, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా హైకోర్టు భవనాల సమీపంలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అలాగే సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
అమరావతి ఎకనామిక్ రీజియన్ RFCకు తొమ్మిది జిల్లాల పరిధిలో ఆమోదం తెలిపే అంశాన్ని కూడా కేబినెట్ పరిశీలిస్తోంది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్–బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కల్పించే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.
సంక్షేమ రంగంలో ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల విడుదలపై కూడా మంత్రి మండలి చర్చించనుంది. పథకం అమలు, లబ్ధిదారులకు నిధుల పంపిణీ విధానంపై సంబంధిత శాఖలు కేబినెట్‌కు వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
పంచాయతీ రాజ్ శాఖకు వివిధ విభాగాల్లో కేంద్ర స్థాయి అవార్డులు రావడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను కేబినెట్ సమావేశంలో అధికారులు ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందించారు.
ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనబరచాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యాటక ప్రోత్సాహానికి ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.







