రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు : ప్రజలకు, మోదీ, పవన్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం రాష్ట్రానికి సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్లినప్పటికీ, వాటిని అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు. అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని, ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి వర్గం గెలవాలనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం.
రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.
ఈ రెండేళ్ల ప్రయాణంలో రాష్ట్ర ప్రజలు చూపిన అండ, మద్దతుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రజల సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ... జై ఆంధ్రప్రదేశ్!
కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర భవిష్యత్తును స్వర్ణాంధ్ర దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తన సందేశం ద్వారా స్పష్టం చేశారు.







