రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
తిరుపతి సభలో కూటమి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటన
జగన్, షర్మిల శవ రాజకీయాలు మానుకోవాలి: పీవీఎన్ మాధవ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో శవాలపై రాజకీయాలు చేయడం ఆపాలని వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ పార్టీ నేత షర్మిలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన, రాబోయే ఎన్డీఏ సభపై స్పందించారు.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు విస్తృతమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. రేపు తిరుపతి వేదికగా జరగబోయే భారీ ఎన్డీఏ సభలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతలు పాల్గొననున్నారని, ఈ సభలో కూటమి భవిష్యత్తు ప్రణాళికను ప్రజలకు వివరించనున్నారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 12 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన ప్రగతి, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికీ చేరేలా బీజేపీ కృషి చేస్తోందని మాధవ్ చెప్పారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్, వికసిత్ ఏపీ’ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఐరన్ ఓర్ ప్రమాదంలో కార్మికులు మృతి చెందిన ఘటనపై పీవీఎన్ మాధవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన జగన్‌పై ఆయన విమర్శలు చేశారు. శవాలను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా నిలిపివేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను పీవీఎన్ మాధవ్ ప్రస్తావించారు. ఆ ప్లాంట్‌కు కేంద్రం నిధులు కేటాయించి, ప్రైవేటు పరం కాకుండా ఆపిందని తామే చేసిన కృషి ఫలితమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న ప్రకటనలను ఆయన ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా నేనే చేశాను అని జగన్ ఎలా చెప్పుకుంటారు?
అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయ లాభం కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం పట్ల బీజేపీ కట్టుబడి ఉందని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే దిశగా ఉన్నాయని మాధవ్ పేర్కొన్నారు.







