రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం, భూకుంభకోణాలపైనా జగన్‌ బహిరంగ చర్చకు రావాలని లోకేశ్‌ సవాల్‌ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో తెదేపా శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ 2లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనచరిత్ర తెదేపాదన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. ‘అభివృద్ధి, సంక్షేమం తెదేపా సిద్ధాంతమైతే.. బూతులు, విధ్వంసం గొడ్డలిపార్టీ విధానం. 150 రోజుల్లో రికార్డుస్థాయిలో డీఎస్సీని విజయవంతంగా నిర్వహిస్తే 150 కేసులు వేసి జగన్‌ వర్గం అడ్డుకోవాలని చూసింది. వాళ్లు వేసిన కేసులన్నింటినీ కోర్టులు కొట్టివేయడం మన చిత్తశుద్ధికి నిదర్శనం. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెదేపా కార్యకర్తపైనా ఉంది’ అన్నారు. 

సీసీడీ వ్యాధితో బాధపడుతున్న జగన్‌ 

పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ (సీసీడీ) అనే వ్యాధి ఉందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ, గూగుల్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ లాంటి పరిశ్రమలను తానే తెచ్చానంటూ చెప్పుకోవడం ఈ జబ్బు లక్షణాలన్నారు.  

కార్యకర్తలకు వైద్యపరీక్షలు..

‘కార్యకర్త కుటుంబం, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. తెదేపా కేంద్ర కార్యాలయంలోని యూనిట్, బూత్‌ ఇన్‌ఛార్జులకు రక్తపరీక్షలు చేస్తే 75 శాతం మందికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నట్టు బయటపడింది. అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులకు వైద్య పరీక్షలు చేయించి.. ఉచితంగా మందులు అందించే కార్యక్రమం చేపడుతున్నాం’ అని చెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.