ఎన్నికల హామీలన్నీ అమలు చేసితీరుతాం : డిప్యూటీ సీఎం పవన్‌

తిరుపతి: ప్రజలు కేవలం ఓటు వేయడం మాత్రమే కాకుండా చరిత్ర సృష్టించగలరని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు పుట్టాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుపై నమ్మకం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా చరిత్రను మార్చగల శక్తి తమ వద్ద ఉందని నిరూపించారని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ సహా కూటమి నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సభలో పాల్గొన్నారు.

రెండేళ్ల క్రితం కేవలం అధికారం కాదు.. బాధ్యత ఇచ్చారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇది. ఏపీ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి ఇది. అధికారం పంచుకోవడానికి కాదు.. బాధ్యత పంచుకునేందుకు కూటమి ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతో సరిపెట్టుకున్న సందర్భంలో చాలామంది విమర్శించారు. కానీ, ప్రజల ఆశీర్వాదంతో వందశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తున్నాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన మోదీకి అభినందనలు. ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగాం. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన జరిగినందున ఈనెల 9న జరగాల్సిన కార్యక్రమం ఇవాళ జరుపుకొంటున్నాం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే

అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణ లక్ష్యంతో ఏర్పడిన కూటమి అధికారం కోసం కాదని, బాధ్యత కోసం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు కేటాయించిన 21 స్థానాలపై అప్పట్లో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, ప్రజల ఆశీర్వాదంతో ఆ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించడం ద్వారా కూటమి పట్ల ప్రజల నమ్మకం ఎంత బలంగా ఉందో రుజువైందని వివరించారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో ముందుకు సాగుతోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నిరంతరాయంగా సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు.

ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డగలిగామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఆ దుర్ఘటన కారణంగా ఈ నెల 9న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు చెప్పేది ప్రజలేనని ఉప ముఖ్యమంత్రి మరోసారి హైలైట్‌ చేశారు.