అమరావతి: మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తయింది. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు తమ జట్ల కోసం క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి. మొత్తం 191 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా, వారిలో 74 మందికి ఫ్రాంఛైజీలు అవకాశం కల్పించాయి.

ఆల్‌రౌండర్ హెర్నిటా ప్లవియా ఫెరీరా ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఆమెను గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు రూ.4.30 లక్షలకు దక్కించుకుంది. రెండో అత్యధిక మొత్తం అంజలి శర్వాణికి లభించింది. ఆమెను వైజాగ్ ఫైర్ బర్డ్స్ రూ.3.60 లక్షలకు కొనుగోలు చేసింది. అదే జట్టు అయేషా సింగ్‌ను రూ.2.40 లక్షలకు తీసుకుంది.

అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు వూహాత్మకంగా వ్యవహరిస్తూ, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టింది. ఈ జట్టు అనూషను రూ.2.10 లక్షలకు, దేవికను రూ.2 లక్షలకు దక్కించుకుంది. వేములపాటి సేతుసాయిని రాయలసీమ జెన్ స్టార్స్ రూ.2.10 లక్షలకు కొనుగోలు చేసింది.

టీమ్ ఇండియా తరఫున ఆసియా కప్, ఆసియా క్రీడల జట్టులో ఆడనున్న స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి ఈ లీగ్ తొలి దశలో అందుబాటులో ఉండకపోవడంతో, ఆమెపై ఫ్రాంఛైజీల పోటీ పెద్దగా కనిపించలేదు. చివరికి రాయలసీమ జెన్ స్టార్స్ ఆమెను రూ.1.10 లక్షలకు తీసుకుంది.

డబ్ల్యూఏపీఎల్‌లో ఆడనున్న పిన్న వయస్కురాలిగా 12 ఏళ్ల సాయి షణ్ముకప్రియ నిలిచింది. ఆమె రాయలసీమ జెన్ స్టార్స్ తరఫున బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 15న మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో డబ్ల్యూఏపీఎల్ ఆరంభంకానుంది.

లీగ్ అంబాసిడర్ మిథాలీ రాజ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు, ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ తదితరులు వేలం ప్రక్రియను పర్యవేక్షించారు.

అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు గ్రేడ్-ఏలో ఉన్న నీరగట్టు అనూష (బ్యాటర్), కండ్రేగుల దేవిక (ఆల్‌రౌండర్), కాట్రగడ్డ దీక్ష (వికెట్ కీపర్), షబ్నమ్ షకీల్ (ఆల్‌రౌండర్), పి.రంగలక్ష్మి (బ్యాటర్), తరుణి జోషి (ఆల్‌రౌండర్), అంకం విష్ణుప్రియ (బ్యాటర్)లను తమ జట్టులోకి చేర్చుకుంది. వన్డే, టీ-20ల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రతిభ చూపిన ఈ క్రీడాకారిణులతో పాటు, మిగిలిన వారిని గ్రేడ్-బి నుంచి ఎంపిక చేసింది.

అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టులో 11 మంది ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్లు కూడా బ్యాలెన్స్‌డ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసుకునేలా బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లను సమతూకంగా ఎంపిక చేశాయి.

మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఏసీఏ ఈ టోర్నీని ప్రారంభించింది. తొలి వేలం విజయవంతంగా ముగియడంతో, సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌లపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.