కడప : దళితులు, మాదిగల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న “దళిత గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు.

కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం నరసింహ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలు, దళితులు, ఎస్టీలు, ఇతర బహుజన వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన రూ.700 కోట్లకు పైగా సబ్సిడీ రుణాల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాలని ఆయన డిమాండ్ చేశారు.

దళితులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దళితులు, మాదిగలు ఒక్కటిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్‌లో జరగనున్న దళిత గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై తమ శక్తిని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.

దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సబ్సిడీ రుణాల విడుదలలో జాప్యం వంటి అంశాలపై దళిత గర్జన వేదికగా ఘనంగా చర్చించి, ప్రభుత్వాన్ని నిలదీయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఎన్. రాజా, రాష్ట్ర మహిళా నాయకురాలు చెన్నమ్మ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొట్టం సుబ్బారావు, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నరసింహులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి మేరీ, ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షులు కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు వరాల నరసింహులు, అరిటకుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.