రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న ‘‘డీలిమిటేషన్’’ బిల్లుకు డీఎంకే నుంచి మద్దతు లభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపిందని ఆర్ఎస్పీ లోక్‌సభ సభ్యుడు ఎస్కే ప్రేమచంద్రన్ వెల్లడించడంతో ఈ అంశం మరింత హాట్‌టాపిక్‌గా మారింది.
అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌పై డీఎంకే వైఖరి ఏమిటన్న దానిపై విభిన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, కేంద్రం తీసుకురాబోయే అసలు బిల్లులో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఎస్కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తిరుచి శివ, డీలిమిటేషన్ విషయంలో కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఆందోళన డీఎంకేకు ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలకే అన్వయించాలనే అభిప్రాయాన్ని కూడా డీఎంకే వ్యక్తం చేసినట్లు ఆయన సూచించారు.
ప్రస్తుతం లభ్యమైన సమాచారం ప్రకారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో లోక్‌సభలో మౌఖికంగా సూచించినట్లుగా, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే అంశాన్ని బిల్లులో స్పష్టంగా చేర్చితే, దానిని సానుకూలంగా పరిశీలించేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీలిమిటేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లుగా వస్తుండటంతో, దాన్ని ఆమోదించేందుకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 319 మంది ఎంపీల మద్దతు ఉంది. బిల్లు ఆమోదానికి 360 మంది మద్దతు కావాల్సి ఉండగా, ఇంకా 41 ఓట్లు తక్కువగా ఉన్నాయి. లోక్‌సభలో డీఎంకేకు 22 మంది సభ్యులు ఉన్నారు. డీఎంకే మద్దతు ఇస్తే లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, ఎన్డీయేకు అవసరమైన సంఖ్యా బలం సమకూరే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
2026లో ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం, లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచే యోచన ఉంది. ఈ పెరిగిన స్థానాలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే, గతంలో ఈ తరహా ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనను అవి వ్యక్తం చేస్తున్నాయి.
జనాభా ఆధారంగా కాకుండా, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచే ప్రతిపాదనపై దక్షిణాది పార్టీలూ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ, డీలిమిటేషన్ తీరుతెన్నులు, మహిళా రిజర్వేషన్ అమలు విధానం, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావం వంటి అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, ఈ బిల్లుపై రాజకీయ చర్చలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.







