చెన్నై:- డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే తన రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టీవీకే వైపు ఈ పార్టీ మొగ్గు చూపుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఎండీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, తదనంతరం టీవీకేకు బహిరంగ మద్దతు ప్రకటించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయనే సమాచారం వెలువడింది.

తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు తిరుచ్చి వెళ్లిన జోసెఫ్‌ విజయ్‌ను ఎండీఎంకే ముఖ్యకార్యదర్శి, తిరుచ్చి ఎంపీ దురై వైగో స్వాగతించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డీఎంకే గుర్తుతో పోటీ చేయాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన దురై వైగో, ఆ కారణంగానే టీవీకేకు మద్దతు ప్రకటించే అవకాశం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్లో టీవీకేకు మద్దతు ఇవ్వలేకపోయిన ఆవేదన స్పష్టంగా కనిపించింది.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ఎండీఎంకే అభ్యర్థులు బరిలోకి దిగగా, వాటిలో సెంథిల్‌ సెల్వన్‌ (సీర్కాళి), రాజేంద్రన్‌ (కడైయనల్లూర్‌) మాత్రమే గెలుపొందారు. వీరు డీఎంకే గుర్తుతో పోటీ చేసి గెలిచినందున అధికారికంగా డీఎంకే ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితి కారణంగానే టీవీకేకు బహిరంగ మద్దతు ప్రకటించలేకపోయామని ఎండీఎంకే వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే డీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్‌ వంటి పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పార్టీలకు కేబినెట్‌లో చోటు లభించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నేపథ్యంలో ఎండీఎంకే కూడా తన రాజకీయ మనుగడ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రతిపక్ష హోదాను మాత్రమే కాపాడుకోగలిగింది. ఈ పరిణామం తర్వాత డీఎంకే నాయకత్వంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమిలో భాగమైన పలు పార్టీలు తమ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై పునరాలోచన ప్రారంభించాయి. అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. వారి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో వారినే టీవీకే అభ్యర్థులుగా నిలబెట్టే అవకాశాలపై చర్చ నడుస్తోంది. గెలుపు సాధించిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి వారికి చోటు కల్పించనున్నారనే ప్రచారం కూడా ఉంది.

ఇదే తరహాలో ఎండీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, అనంతరం టీవీకేకు మద్దతు ప్రకటించే దిశగా దురై వైగో ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 27న చెన్నైలో జరగనున్న ఎండీఎంకే సర్వసభ్య సమావేశం కీలకంగా మారింది. ఆ సమావేశంలో డీఎంకే కూటమి నుంచి వైదొలగడం, టీవీకేకు అధికారిక మద్దతు ప్రకటించడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.