రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
మోదీ ఏం చేశారో? నేనేం చేశానో చర్చకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించడం, పాలనా సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సైబరాబాద్‌లో రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడిన సీఎం, వచ్చే రెండేళ్లు రాజకీయాలకు పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలపై చర్చించుకోవచ్చని సూచించారు.
సైబరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, దేశ ఐటీ ఎగుమతుల్లో 16.77 శాతం వాటా హైదరాబాద్‌కే దక్కుతోందని రేవంత్‌రెడ్డి వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు నడిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ నుంచి ఎన్నికైన భాజపా ఎంపీల పనితీరుపై సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది భాజపా ఎంపీలను పంపడంతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, అయితే ఆ ఎంపీలు రాష్ట్రానికి ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లలో తాను ఏం చేయలేదని విమర్శిస్తున్నవారే గత పదేళ్లలో ఏమి చేశారో ముందుగా చెప్పాలని సవాలు విసిరారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రణాళికలను వివరించిన రేవంత్‌రెడ్డి, పేదలకు లక్ష ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని గుర్తుచేశారు. విశ్వనగరం పేరుతో ఇళ్లు కట్టుకుంటే సరిపోదని, దానికి తగిన మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.













