తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గరిడి వీధి, అమరా గార్డెన్ ప్రాంతాల్లో మురికి నీటి సమస్య స్థానిక ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై మురికి నీరు చేరి, రోజువారీ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో గోతులు, మాన్హోళ్‌లు స్పష్టంగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు నివాసితులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రహదారులపై నిలిచిపోయిన మురికి నీటిలో గోతులు కనిపించక బైక్‌లు, ఆటోలు జారి పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొంటున్నారు.

రోడ్లపై నిలిచిపోయిన మురికి నీటిని తొలగించడంలో పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యను పలుమార్లు పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడంలేదని వారు విమర్శిస్తున్నారు.

పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి రహదారులపై నిలిచిపోయిన మురికి నీటిలో ప్రయాణించడం భయంకరంగా మారిందని, పిల్లలు, వృద్ధులు నడవడానికి కూడా భయపడుతున్నారని వారు చెబుతున్నారు.

మురికి నీటి కాలువల పుడికతీత పనుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, పట్టణంలో ఎక్కడపడితే అక్కడ మురికి నీరు నిలిచిపోవడం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ పనులను పర్యవేక్షించిన పురపాలక సంఘం కమిషనర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

గరిడి వీధి, అమరా గార్డెన్ ప్రాంతాల్లో నెలకొన్న మురికి నీటి సమస్యపై పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై నిలిచిపోయిన మురికి నీటిని తక్షణమే తొలగించి, కాలువలను శుభ్రపరచి, వర్షపు నీరు నిలిచిపోకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా, ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పట్టణ ప్రజానీకం పురపాలక సంఘం అధికారులను కోరుతోంది.