రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో ఆర్టీసీ హైర్ బస్ అపహరణ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విజయవాడ నుండి తిరుపతికి వచ్చిన గవర్నర్ పేట టు డిపోకు చెందిన హైర్ బస్సు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేగింది.
వివరాల్లోకి వెళ్తే, గవర్నర్ పేట టు డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు ఈ నెల 20వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకుంది. బస్సును తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి, డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూమ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. సాధారణంగా ఉదయం 3.30 గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరాల్సి ఉండగా, ఆ సమయానికి బస్సు వద్దకు వెళ్లిన డ్రైవర్‌కు బస్సు కనిపించలేదు.
బస్ జాడ కనిపించకపోవడంతో డ్రైవర్ నాగేశ్వరరావు వెంటనే బస్ యజమాని, ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాడు. ఆర్టీసీ అధికారుల సూచనల మేరకు నాగేశ్వరరావు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు క్రైమ్ నెంబర్ 536/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, బస్ యజమాని వెంకటేశ్వరరావు బస్సులో అమర్చిన జిపిఆర్ఎస్ ద్వారా వాహనం నంద్యాల వైపు కదులుతున్నట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న చాగలమర్రి పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.
చాగలమర్రి పోలీసుల చర్యలతో బస్సును స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడు విష్ణును అదుపులోకి తీసుకున్నారు. బస్సు అపహరణకు గల కారణాలు, నిందితుడి నేపథ్యం, మరెవరైనా ఇందులో భాగస్వాములయ్యారా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
నిందితుడిని, ఆర్టీసీ హైర్ బస్సును తిరుపతికి తీసుకురానున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బస్టాండ్‌లోనే పార్క్ చేసిన బస్సు అపహరణకు గురవడం, అది మరో జిల్లాకు వెళ్లేంత వరకు ఎవరికీ తెలియకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బస్టాండ్‌లో భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ వర్గాలు అంతర్గతంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.













