రాయలసీమ న్యూస్, తిరుపతి: చంద్రగిరి మండలం ఏ.రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఇంజనీరింగ్ సదస్సు జరగనుంది. "స్థిరమైన భవిష్యత్తు కోసం వినూత్న ఇంజనీరింగ్" అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి. రమణ, రిజిస్ట్రార్ డాక్టర్ కే. సారథి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ సాంకేతిక సహకారంతో ఈ అంతర్జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
సదస్సు వివరాలను వెల్లడిస్తూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మాట్లాడుతూ పునరుత్పాదక శక్తి, స్మార్ట్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలపై విస్తృత చర్చలు, సాంకేతిక సెషన్లు జరుగనున్నాయని తెలిపారు. ఈ రంగాల్లో తాజా పరిశోధనలు, వినూత్న ప్రయోగాలు, అనువర్తనాలపై నిపుణులు తమ అభిప్రాయాలు, పరిశోధన ఫలితాలను పంచుకోనున్నారని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, పారిశ్రామిక నిపుణులు ఈ వేదికపై తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారని వారు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ అంతర్జాతీయ సదస్సును దిగ్విజయం చేయడానికి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆచార్య రమణ, డాక్టర్ సారథి పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీన్ ఎస్ఓఈ డాక్టర్ బాబు దేవసేనాపతి, జనరల్ ఛైర్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఈఈ డాక్టర్ ఎం. ఎస్. సుజాత, ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ కౌన్సిలర్ డాక్టర్ బి. హేమంత్ కుమార్, టెక్నికల్ ప్రోగ్రామ్ కమిటీ ఛైర్, ఫ్యాకల్టీ అడ్వైజర్, ఐఈఈఈ పిఈఎస్ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ డాక్టర్ సురేష్ బాబు దారం తదితరులు పాల్గొన్నారు.













