రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
నాయుడుపేట జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లాతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, సిబ్బంది నియామకం, ఏజెంట్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్నికల కమిషన్ నిబంధనల అమలు పరిస్థితిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల స్వీకరణ, నమోదు, లెక్కింపు విధానంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లను, కంప్యూటర్ వ్యవస్థలను, ఫలితాల నమోదు విధానాన్ని పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించే విధంగా పాస్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కౌంటింగ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు, మైక్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, నాయుడుపేట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర పురపాలక సంఘాల కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు సమాచారం.













