రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ నెలలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నెల పొడవునా వివిధ ఉత్సవాలు, ఆస్థానాలు, వర్ష తిరు నక్షత్రాలు, శాత్తుమొర కార్యక్రమాలు భక్తులను ఆకర్షించనున్నాయి.
నవంబర్ 2వ తేదీన తిరుమల నంబి ఉత్సవారంభం జరగనుంది. అనంతరం నవంబర్ 4వ తేదీన శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నవంబర్ 8వ తేదీన ఘనంగా చేపట్టనున్నారు.
నవంబర్ 11వ తేదీన తిరుమల నంబి శాత్తుమొర కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 13వ తేదీన నాగుల చవితి సందర్భంగా తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం నిర్వహించడంతో పాటు శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర కూడా నిర్వహించనున్నారు.
నవంబర్ 14వ తేదీన సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం జరగనుంది. నవంబర్ 15వ తేదీన శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ కార్యక్రమంతో పాటు తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రాన్ని నిర్వహించనున్నారు.
నవంబర్ 16వ తేదీన శ్రీవారి పుష్ప యాగం ప్రధానంగా జరుగుతుంది. అదే రోజు అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
నవంబర్ 19వ తేదీన యాజ్ఞవల్క్య జయంతిని ఆలయ పరిధిలో ఆచరించనున్నారు. నవంబర్ 21వ తేదీన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు.
నవంబర్ 24వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర కూడా జరగనుంది. నవంబర్ 25వ తేదీన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ వివరాలు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిన ప్రకటనలో వెల్లడయ్యాయి.













