రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి లో పట్టపగలే ఓ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఏం.ఆర్. పల్లి పంచాయతీ ప్రైమరీ హాస్పిటల్ ఎదుట గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వైకుంటపురం లో నివాసముంటున్న హిమబిందు ఆటోలో ప్రయాణిస్తుండగా, అక్కడికి కారులో వచ్చిన ఆకాశ్ ఆమె ఆటోను అడ్డగించి దాడికి పాల్పడ్డాడు. కారులో నుండి దిగిన ఆకాశ్, ఆటోలో ఉన్న హిమబిందు పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.
దాడిలో హిమబిందు స్వల్ప గాయాలు పొందినప్పటికీ, ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీసిందని స్థానికులు తెలిపారు. అనంతరం ఆమెను వెంటనే రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు సూచిస్తున్నాయి.
హిమబిందు భర్త మహమ్మద్ షరీఫ్ విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వైకుంటపురం వద్ద నివసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన దాడి స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన ఘర్షణే ఈ హత్యాయత్నానికి దారి తీసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని పోలీసులు పేర్కొన్నారు.
రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిమబిందు ను ఎస్వీ యూనివర్సిటీ సిఐ నరేష్ స్వయంగా విచారిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు.
దాడికి పాల్పడిన ఆకాశ్ పై కేసు నమోదు చేసి, అతని కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఆర్థిక లావాదేవీల స్వరూపం, ఇరువురి మధ్య ఉన్న సంబంధం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.













