రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నాయకులు అరాచకాలకు తెగబడుతున్నారని వైకాపా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి హైమావతి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల రోజు ఉదయం ఆరు గంటల నుంచే కూటమి నాయకులు బెదిరింపులు, గందరగోళం సృష్టించడం ప్రారంభించారని ఆరోపించారు. తాత్కాలికంగా కూటమి విజయం సాధించినా, నైతికంగా గెలుపు మాత్రం వైకాపాకే చెందుతుందని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు మొత్తం 64 పోలింగ్ కేంద్రాల్లో ధైర్యంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. ముఖ్యంగా మహిళా ఏజెంట్లను కూడా కూటమి నాయకులు బెదిరించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో జరిగిన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని రామ సుబ్బారెడ్డి విమర్శించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం ఆదినారాయణరెడ్డి ఏమి చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
బాబాయ్ అనుకుంటే... అబ్బాయి మరింత ప్రమాదకరంగా మారుతున్నార
అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రిగ్గింగ్ జరిగిందని తాము అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కంటి తుడుపు చర్యగా కేవలం మూడు వార్డుల్లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించారని రామ సుబ్బారెడ్డి ఆరోపించారు.
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించిన వారికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగవని, ప్రజలు అన్ని చూసి తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శివారెడ్డి, గిరిధర్ రెడ్డి, ముల్లా జానీ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికలపై ఆరోపణలు, ప్రతియారోపణలతో రాజకీయ వేడి చెలరేగిన నేపథ్యంలో రామ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.













