రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పులివెందుల : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల అర్భన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నవంబరు 1న జరిగిన పోలింగ్ రోజు పులివెందులలోని ఎన్నికల ఆర్వో కార్యాలయం వద్ద వైఎస్ జగన్ వైసీపీ ఏజెంట్లతో కలిసి ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ రోజు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే విధంగా ఏ సమావేశాలు, ధర్నాలు నిర్వహించకూడదని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్వో కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
దీంతో వైఎస్ జగన్తో పాటు ధర్నాలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మరో 70 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో అమల్లో ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన కోణంలోనే ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
పోలింగ్ రోజు ఆర్వో కార్యాలయం పరిసరాల్లో జరిగిన ఈ ధర్నా కారణంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు స్థానికంగా చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర వైసీపీ కార్యకర్తలపై నమోదు చేసిన కేసుల వివరాలు, ఎలాంటి ధారాల కింద కేసు పెట్టారన్న అంశంపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. అయితే పోలింగ్ రోజున ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు ప్రాధాన్యం సంతరించుకుంది.













