రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, సాకన్, బి.మట్టం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాల కోసం బద్వేల్లోని అంబేద్కర్ గురుకులాన్ని కేంద్రంగా నిర్ణయించినట్లు కలెక్టర్ వివరించారు.
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కేంద్రంగా కేటాయించినట్లు తెలిపారు.
కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ఎన్నికల నిర్వహణ కోసం కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాల కోసం పులివెందులలోని ZPHS, రామనప్ప సత్రం, అన్నకాలమగుడు పాఠశాలను కేంద్రాలుగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నందలూరు, రాజంపేట, T.సుండుపల్లి, వీరబల్లి మండలాల ఎన్నికల నిర్వహణ కోసం రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేంద్రంగా ఖరారు చేసినట్లు డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
ఖరారు చేసిన ఈ కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు సమకూర్చాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో బారికేడ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కార్యనిర్వాహక, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు నిబంధనల ప్రకారం పర్యవేక్షించాలని సూచించినట్లు వివరించారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.













