రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
వర్షాల ముందస్తు చర్యలు: ప్రొద్దుటూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు:హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
ప్రొద్దుటూరు: రానున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సూచనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్ష జరిగింది.
వర్షాల సమయంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను తక్షణమే ఎదుర్కొనేందుకు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక సెక్రటరీ, పది మంది పారిశుధ్య కార్మికులతో ఈ టీమ్‌ను ఏర్పాటు చేసి, అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచాలని సూచించారు.
మోర్ సూపర్ మార్కెట్, జంగంపేట, రాజీవ్ సర్కిల్ తదితర వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట నీటిని తొలగించేందుకు మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు సజావుగా పారేలా ప్రధాన కాలువలు, చిన్న కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను తొలగించి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వర్షాల సమయంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించేలా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమస్యలను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలకు సంబంధించిన సమస్యలు, రహదారులపై నీరు నిల్వ ఉండటం, కాలువలు పొంగిపొర్లడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.
త్రాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యల కోసం అసిస్టెంట్ ఇంజనీర్ కె. సురేంద్ర నాథ్ రెడ్డి (ఫోన్: 77995 72160) ను సంప్రదించాలని సూచించారు. పారిశుద్ధ్య సంబంధిత సమస్యల కోసం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. ఎస్. రమేష్ (ఫోన్: 90142 65600) ను సంప్రదించవచ్చు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాత వడగట్టి తాగాలని, ప్రతి ఒక్కరూ తాగునీటిని కాచి, వడగట్టి మాత్రమే వినియోగించాలని సూచించారు.
పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పెరగకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, నిల్వ ఉన్న ఆహారం, కలుషితమైన నీటిని వినియోగించకూడదని హెచ్చరించారు. జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఉధృతంగా ప్రవహించే నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరిస్తూ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మున్సిపల్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని కమిషనర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల భద్రత, ఆరోగ్యం మా ప్రథమ ప్రాధాన్యత. వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుంది. ప్రజలు కూడా మున్సిపాలిటీ సూచించే జాగ్రత్తలను పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ప్రొద్దుటూరును సురక్షితంగా ఉంచుకుందాం
అని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు.













