ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహా ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలు, ఇండియా కూటమికి చెందిన అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ స్థాయి ప్రముఖ నాయకులు భారీగా హాజరయ్యారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌తో పాటు అనేక మంది నాయకులు పాల్గొన్నారు.

దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఓట్ల చోరీని అరికట్టడం, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీసీసీ కోఆర్డినేటర్, ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ భాషా పాల్గొని, పార్టీ నాయకత్వంతో కలిసి ధర్నాకు మద్దతు తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన ఈ మహా ధర్నాకు దేశవ్యాప్తంగా నుంచి లక్షలాదిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తరలివచ్చారు. రాంలీలా మైదానం నిండిపోయేలా ప్రజలు హాజరుకావడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ మహా నిరసన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య భవిష్యత్తు వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని ఆయన స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగాన్ని, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే ఏ శక్తినీ ఉపేక్షించబోమని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడి పోరాడుతుందని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఏ నాయకుడిపైనా తనకు వ్యక్తిగత కక్ష లేదని, వ్యక్తులపై పోరాటం కాదని, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న భావజాలంపైనే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

మేము ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచే వ్యక్తులమని, సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ పరస్పర ప్రేమాభిమానాలతో ముందుకు సాగుతామని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. అయితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూసే భావజాలంపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టంగా తెలియజేశారు.

భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కటవుతున్నారని, ఈ పోరాటం లక్ష్యాన్ని చేరుకునే వరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గబోదని ఈ మహా ధర్నా మరోసారి నిరూపించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.