రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను ఎక్కడా అడ్డుకోలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. పులివెందులలో పోలింగ్ ఏజెంట్లకు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా లతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతులు, పులివెందులలో పోలింగ్ ఏజెంట్లకు సంబంధించిన అంశాలపై వస్తున్న ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ పులివెందులకు చేరుకునే సమయంపై తొలుత మధ్యాహ్నం 1 గంటగా సమాచారం అందిందని, దానికి అనుగుణంగా ఈ నెల 27వ తేదీనే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున ఎస్పీ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.
అయితే ఆదివారం ఉదయం ఆకస్మికంగా ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ చేరుకుంటుందని సమాచారం అందిందని, అదే సమయంలో పులివెందుల ప్రాంతంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ సూచన మేరకు తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతించినట్లు ఆయన తెలిపారు. అయితే అప్పటికే హెలికాప్టర్ గాలిలోకి ఎగిరినట్లు ఆపరేటర్ నుంచి సమాచారం రావడంతో, ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం 9.45 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.
హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిన తర్వాత తిరిగి వెళ్లాలని లేదా వేరే ప్రాంతానికి మళ్లించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని కలెక్టర్ తెలిపారు.
పులివెందులలో పోలింగ్ ఏజెంట్ల నమోదు వివరాలను వెల్లడిస్తూ, మొత్తం 80 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 47 మంది పోలింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటలలోపే నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకల్లా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, అభ్యర్థులు ఇచ్చిన అనుమతి పత్రం, గుర్తింపు కార్డు, ఛాయాచిత్రాన్ని సమర్పించి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు.
ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య కొంతమంది ఏజెంట్లు వివిధ కారణాలతో పోలింగ్ కేంద్రాలను విడిచివెళ్లినట్లు సమాచారం అందిందని, మరికొందరు తమ విధుల్లో కొనసాగినట్లు తెలిపారు. ఏ ఒక్క పోలింగ్ ఏజెంట్‌ను గానీ, అభ్యర్థులు అనుమతించిన ప్రతినిధులను గానీ అధికారులు అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
పులివెందులలోని అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపలి పరిస్థితులను వెబ్‌కాస్టింగ్ ద్వారా, బయట పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా గమనిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపినట్లు గానీ, దౌర్జన్యానికి పాల్పడినట్లు గానీ ఎలాంటి ఘటనలు ఈ దృశ్యాల్లో నమోదు కాలేదని, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు కూడా ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ఆయన చెప్పారు.
జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 560 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. కొన్ని శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని 100 మీటర్ల వెలుపల చోటుచేసుకున్నప్పటికీ, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగలేదని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో సుమారు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను చూసి ఓటర్లు అయోమయానికి గురికావద్దని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.













