రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: పులివెందుల: స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి బెంగళూరు నుంచి పులివెందులకు బయలుదేరిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్‌కు ల్యాండింగ్ అనుమతి ఇవ్వకుండా అధికారులు వ్యవహరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ శ్రేణుల సమాచారం ప్రకారం, పులివెందులలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో సుమారు 20 నిమిషాల పాటు అది గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంధనం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు.
పులివెందులలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ అడుగు పెట్టకుండా చూడాలనే ఉద్దేశంతోనే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని వైసీపీ వర్గాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి ఆటంకాలు సృష్టించడం ప్రభుత్వ వైఖరిని బట్టబయలు చేస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీపీ అధినేత పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న నాయకుడి ప్రయాణానికి అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు.
హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి నిరాకరణపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ ప్రయాణం, హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి అంశంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ పరిణామం పులివెందుల రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించినట్లు కనిపిస్తోంది.













