రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరుగుతోందని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
భూపేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జూలై 14 సాయంత్రం నారా లోకేష్ కడప ఎయిర్పోర్ట్‌కు చేరుకోనున్నారు. అనంతరం మైలవరం మండలం తాడిపత్రి రోడ్డులోని కర్మలవారిపల్లెలో రాత్రి బస చేయనున్నారు. జూలై 15 ఉదయం దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రూ. 3100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని భూపేష్ రెడ్డి వివరించారు. పారిశ్రామిక రంగంలో ఇలాంటి భారీ పెట్టుబడులు రావడం కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాల ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు.
శంఖస్థాపన అనంతరం అదే రోజు ప్రొద్దుటూరులో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం కడప ఎయిర్పోర్ట్ నుండి అమరావతికి నారా లోకేష్ తిరుగు ప్రయాణం కానున్నట్లు భూపేష్ రెడ్డి చెప్పారు.
గత ఐదు సంవత్సరాల వైస్సార్సీపీ పాలనలో కడప జిల్లా అభివృద్ధిని విస్మరించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక క్రెడిట్ కోసం డ్రామాలు చేస్తున్నారని భూపేష్ రెడ్డి విమర్శించారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు వైస్సార్సీపీ ఆరోపణలను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.
దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ స్థాపనతో కడప జిల్లా పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని, అన్సెల్లరీ పరిశ్రమలు, సేవా రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నారా లోకేష్ పర్యటనతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం చేకూరుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.













