రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పట్టాభిరాం, గతంలో గొడ్డలి పార్టీ పాలన అవినీతి, చెత్త పాలనతో సాగిందని విమర్శించారు. ప్రొద్దుటూరు గొడ్డలి పార్టీ నాయకుడు రాచమల్లు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను విధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా లక్షల టన్నుల చెత్త పేరుకుపోయే పరిస్థితి తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు.
చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు మిమ్మల్ని చెత్తకుప్పలో పడేశారు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెత్త తొలగింపుతో పాటు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతోందని పట్టాభిరాం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 107 ప్రాంతాల్లో చెత్త ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రొద్దుటూరులో 11.5 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక చెత్త శుద్ధి ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతోందని ఆయన వివరించారు.
కడప జిల్లాకు ఉపయోగపడే ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని పట్టాభిరాం ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో భారీ అవినీతి జరిగిందని, బ్రహ్మణి స్టీల్ వ్యవహారంలో వేల ఎకరాల భూములను తక్కువ ధరలకు తీసుకుని, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందారని ఆయన విమర్శించారు.
గొడ్డలి పార్టీ గతంలో చేసినటువంటి అవినీతి కేసుల్లో సంబంధం ఉన్న నాయకులను వదిలే పరిస్థితి లేదని పట్టాభిరాం స్పష్టం చేశారు. రాయలసీమలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, అవినీతి అంశాలపై కూటమి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తియార్, TDP నేత కొండారెడ్డి, TDP జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, మాజీ ZPTC మహేశ్వర్ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.













