ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే దశలో ఉన్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను త్వరలోనే టీం ఇండియా టీ20 జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే, భారత పురుషుల జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు 70 రోజులు మాత్రమే. ఈ నెలాఖరులో ఐర్లాండ్ తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్ వేదికగా ఈ సిరీస్ జరగనుంది.

ఈ సిరీస్‌లో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభిస్తే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. సచిన్ 1989లో పాకిస్థాన్ పై 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడానికి వైభవ్‌కు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరంజ్ కాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్ 237.30గా నమోదైంది. ఒకే సీజన్‌లో ఇంత భారీ పరుగులు, ఇంత వేగంతో సాధించడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం వైభవ్, జూన్ 9 నుంచి 21 వరకు శ్రీ లంక లో జరగనున్న ఇండియా -A త్రైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో శ్రీ లంక -A, ఆఫ్గనిస్తాన్ -A జట్లు కూడా పాల్గొంటాయి. ఈ సిరీస్‌లో వైభవ్ ప్రదర్శనను బీసీసీఐ సెలెక్టర్లు నిశితంగా గమనించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వైభవ్ డెబ్యూపై బీసీసీఐ అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువ క్రికెటర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, అతడు టీం ఇండియా జెర్సీ తొడిగే రోజు కోసం అభిమానులు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టే కనిపిస్తోంది.