అన్నమయ్య జిల్లాలో రైతులను లక్ష్యంగా చేసుకుని ట్రాక్టర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సంబేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా పై నమోదైన 14 ట్రాక్టర్ల చోరీ కేసులను ఛేదించిన పోలీసులు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.64.20 లక్షల విలువైన 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ట్రాక్టర్‌ను నిందితులు ఇప్పటికే విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది.

గత కొంతకాలంగా సంబేపల్లి, గాలివీడు, రాయచోటి పరిసర ప్రాంతాల్లో వరుసగా ట్రాక్టర్ల చోరీలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన సంబేపల్లి పోలీసులు, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు, నిందితుల కదలికలను గుర్తించి వారి ముఠా కార్యకలాపాలపై స్పష్టమైన సమాచారం సేకరించారు. అనంతరం పలు ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా ఈ ముఠా రైతుల వద్ద నుంచి ట్రాక్టర్లను అద్దెకు తీసుకోవడం, తక్కువ ధరకు విక్రయిస్తామంటూ నమ్మించి అడ్వాన్స్ తీసుకోవడం, ఆ తర్వాత ట్రాక్టర్లతో పరారవడం చేస్తున్నట్లు బయటపడింది. కొన్ని చోట్ల నేరుగా పొలాల్లో నిలిపి ఉంచిన ట్రాక్టర్లను దొంగిలించి, ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల వద్ద నుంచి మొత్తం 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో ట్రాక్టర్‌ను ఇప్పటికే విక్రయించినట్టు దర్యాప్తులో తేలిందని, ఆ వాహనాన్ని కూడా త్వరలో రికవరీ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాక్టర్ కొనుగోలు పేరుతో పలువురు రైతుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టు విచారణలో స్పష్టమైంది.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సంబేపల్లి పోలీసు సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. చోరీకి గురైన ట్రాక్టర్లను విధివిధానాలు పూర్తి చేసిన అనంతరం బాధిత రైతులకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించనున్నట్టు పోలీసులు తెలిపారు.