ప్రొద్దుటూరు : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం సభా ప్రాంగణాన్ని శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ బాషా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా బహిరంగ కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక జాతీయ స్థాయి నాయకుడు, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికే ఇలాంటి వివక్షాత్మక అవమానం ఎదురైతే, దేశంలో సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇర్ఫాన్ బాషా ప్రశ్నించారు. ఈ దుశ్చర్య రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను తీవ్రంగా కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు.

ఈ అమానవీయ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, దోషులపై చర్యలు తీసుకోకుండా, కుల వివక్షను ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అత్యంత అన్యాయమని ఇర్ఫాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, బీసీలు, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీని ఇలాంటి అక్రమ కేసులతో భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీని తక్కువగా అంచనా వేస్తోందని, ఇలాంటి అణచివేత చర్యల వల్ల ఆయన పోరాట పటిమ మరింత బలపడుతుందే తప్ప తగ్గదని ఇర్ఫాన్ బాషా అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ పరిరక్షణను కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీకే ఎక్కువగా ఉంటుందని, అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

తక్షణమే రాహుల్ గాంధీపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. సభా ప్రాంగణాన్ని శుద్ధి చేసి కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. దేశంలో రాజ్యాంగ విలువలను, సమానత్వ సూత్రాలను కాపాడేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు.