రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల : నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ (NCORD) కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, I.A.S., మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ సునీల్ షొరాణ్, I.P.S., వారి ఆదేశాల మేరకు ఆగస్టు 31, 2026న సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్‌లోని V.C. హాల్‌లో ఈ సమావేశం జరిగింది. అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎస్. ఖాదర్ బాషా అధ్యక్షత వహించారు.
సమావేశంలో ఎక్సైజ్, పోలీసు, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ, రైల్వే, రవాణా, మహిళా మరియు శిశు సంక్షేమం, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.
విద్యాసంస్థల్లో EAGLE Clubs ఏర్పాటు చేసి, 2026–2029 మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి కూడా అవగాహన కల్పించడం ద్వారా పిల్లలను జాగ్రత్తగా గమనించేలా చేయాలని సూచించారు. విద్యార్థుల నుంచి మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించేలా డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞలు చేయించి, మాదకద్రవ్యాల నిర్మూలనలో వారిని భాగస్వాములను చేసి దేశ అభివృద్ధికి తోడ్పడేలా ప్రోత్సహించాలని సమావేశంలో పేర్కొన్నారు.
విద్యాసంస్థల పరిసరాలను 500 మీటర్ల పరిధిలో మాదకద్రవ్య రహిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే విద్యాసంస్థల చుట్టూ 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిరోధిస్తూ COTPA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్న వారిపై డ్రగ్ డిటెక్టివ్ కిట్స్ ఉపయోగించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తించిన వారికి కౌన్సెలింగ్ అందించి, అవసరమైతే డీ-అడిక్షన్ మరియు పునరావాస కేంద్రాలకు పంపించి, వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సమావేశం సూచించింది.
విద్యాసంస్థలు, హాస్టళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా మరింత పెంచాలని నిర్ణయించారు. అలవాటుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై PIT NDPS Act, 1988 కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లా పోలీసు కార్యాలయం, నంద్యాల ఆధ్వర్యం వహించింది.













