రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి ప్రజాదరణ తగ్గిందని, ఆ పార్టీ నాయకులు గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన సందర్భంగా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సమావేశానికి రాయచోటి నియోజకవర్గ పరిశీలకురాలు అనితా యాదవ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోనమల ఖాదర్ వలి హాజరయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులు ఉన్నప్పటికీ వైసీపీకి చెందిన కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జులు, మైనారిటీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాలేదని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి పోటీ చేయాలని కోరితే, ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలని ఆ పార్టీ నాయకులే తమలోతాము ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
వైసీపీ అభ్యర్థులు పోటీ చేయని వార్డుల్లోనూ పార్టీలకతీతంగా ప్రజలకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా వార్డుల్లో పెన్షన్లు, ఇళ్ల మంజూరు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రాయచోటి నియోజకవర్గానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రి పదవి లభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగల్లు జలాశయం ద్వారా రెండో పైప్లైన్ ఏర్పాటు సహా పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాయచోటి పట్టణంలో పార్కులు, ఇండోర్ స్టేడియం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. రాయచోటి పరిసర ప్రాంతాల్లో యువతను మాదకద్రవ్యాల బారిన పడేలా చేస్తున్న వ్యక్తిని ఎలా చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థి భద్రత కోసం అవసరమైతే ఎస్పీని, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించవచ్చని ఆయన సూచించారు. ఆయుధాలు కలిగిన వ్యక్తులను భద్రత కోసం నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఎక్కడా హింసను ప్రోత్సహించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా తాము వ్యవహరించబోమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు నెలకొనాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే రాజకీయాలకు ప్రాధాన్యాంశాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే ZPTC, MPTC, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.













